సంప్రదాయ ఇంధన వనరుల వైపు వాహనదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) బంకుల విస్తరణ జరుగుతున్నది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన నగరాలకూ పైపులైను ద్వారా సీఎన్‌జీ సరఫరా చేయాలని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) భావిస్తున్నది. ఇప్పటివరకు కాకినాడ నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్‌లోని శామీర్‌పేట, కొంపల్లి, జీడిమెట్ల ప్రాంతాలకు పైపులైను ద్వారా సీఎన్‌జీ సరఫరా అవుతున్నది. అయితే డిమాండ్ పెరుగుతుండటంతో విస్తరణ బాటపట్టిన బీజీఎల్.. వరంగల్, మెదక్, కరీంనగర్, షాద్‌నగర్ ప్రాంతాలకూ సేవలను అందించాలని నిర్ణయించింది. ముందుగా కరీంనగర్ పట్టణంలో సీఎన్‌జీ అందుబాటులోకి తేవాలని చూస్తున్నది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారైన తర్వాత పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. అంతా సజావుగా జరిగితే సంవత్సరంలోగా అందుబాటులోకి రావచ్చని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌తో పోల్చితే తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇవ్వడంతోపాటు, కాలుష్య కారకాలు పరిమితంగా విడుదలై పర్యావరణ పరిరక్షణకూ సీఎన్‌జీ ఎంతో దోహదం చేస్తున్నది.
విస్తరణ దిశగా బీజీఎల్!